
బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ గురు, శుక్రవారం రెండు రోజుల పాటు సమ్మె చేయబోతున్నట్లు యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూఎఫ్‌బీయూ సభ్యులు, కన్వీనర్ బీఎస్ రాంబాబు మాట్లాడుతూ, “బ్యాంకులను ప్రైవేటీకరించడం అంటే ప్రజల సొమ్మును దొంగల చేతుల్లో పెడుతున్నట్లే. ప్రైవేట్ బ్యాంకులు ప్రజలను ఏవిదంగా దోచుకొంటున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన కేంద్రప్రభుత్వమే బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తుండటం దారుణం. కనుక ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే బ్యాంకుల ప్రయివేటీకరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ రేపు, ఎల్లుండి రెండు రోజులు సమ్మె చేయబోతున్నాము. ఒకవేళ కేంద్రప్రభుత్వం తన నిర్ణయం ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మె చేయడానికి వెనకాడబోము. ఢిల్లీలో రైతు ఉద్యమం స్పూర్తితో మేమూ పోరాడుతాము. అవసరమైతే జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌ను ఆహ్వానించి దేశంలో రైతుల మద్దతు కోరుతాము,” అని కేంద్రాన్ని హెచ్చరించారు.