కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఉదయం కాశీలో కొత్తగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాశీలోని గంగానదిలో పుణ్యస్నానమాచరించి కాశీ విశ్వనాథుడికి, కాల భైరవస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాశీ పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులపై పూలు జల్లి వారితో గంగానది ఒడ్డున ఫోటోలు దిగారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “కాశీలో ప్రతీ జీవిలో ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడు. ఇక్కడ మరణం కూడా మంగళకరమే. నాగరికతకు ఆలవాలమైన ఈ కాశీ నగరాన్ని, దీనిలో మందిరాలను నామరూపాలు లేకుండా చేయాలని ఔరంగజేబు వంటి ఎందరో సుల్తానులు ప్రయత్నించారు. కానీ ఏమీ చేయలేకపోయారు. కాశీ విశ్వనాథుని మహిమకు ఇదే నిదర్శనం. ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో శివుని ఆజ్ఞ లేనిదే ఏ పని జరుగదు. అందుకే కరోనా మహమ్మారి అడ్డుపడినప్పటికీ ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయగలిగాము. ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

ఈ కార్యక్రమంలో యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్ తో సహా బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, యోగీ ఆధిత్యనాథ్ తదితరులతో కలిసి గంగానదిలో క్యూయిజ్ (షిప్)పై కాసేపు విహరించారు.