కరోనా, ఒమిక్రాన్ మహమ్మారులు పొంచి ఉన్నా నేటికీ దేశంలో చాలా మంది ఒక్క టీకా కూడా వేసుకొనివారు, రెండో డోస్ టీకా వేసుకొనివారు కోట్లమంది ఉన్నారు. అటువంటివారికి ఈ రెండు రకాల వైరస్లు సోకే ప్రమాదమే కాకుండా వారి ద్వారా మళ్ళీ ఇతరులకు కూడా అవి వ్యాపించే ప్రమాదం ఉంది. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలని గట్టిగా చెపుతున్నాయి. అవసరమైతే మళ్ళీ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బూస్టర్ డోస్‌కు(మూడో డోస్) వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. కానీ అంతకంటే ముందుగా దేశంలో అందరికీ తప్పనిసరిగా రెండు డోసులు వాక్సినేషన్ చేసేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే నయాన్న చెపితే ప్రజలు విననప్పుడు భయన్నైనా ఈ పని పూర్తిచేయక తప్పదు. అందుకే మెదక్ జిల్లాలో నర్సాపూర్ పురపాలక సంఘం కఠిన నిర్ణయం తీసుకొంది. మున్సిపల్ పరిధిలో నివశిస్తున్నవారు అందరూ తప్పనిసరిగా రెండో డోస్ టీకాలు తీసుకోవాలని సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్ళి చెపుతున్నారు. రెండో టీకా వేసుకోవడం వలన కరోనా, ఒమిక్రాన్ వైరస్లు సోకకుండా తప్పించుకోవచ్చునని, టీకాల వలన జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ప్రాణానికి ప్రమాదం ఉండదని నచ్చచెపుతున్నారు. అయినా రెండో టీకా వేసుకోకపోతే పింఛన్లు, రేషన్ బియ్యం వగైరా నిలిపివేయబడతాయని, బ్యాంకులు కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వబోవని హెచ్చరిస్తూ ప్రతీ ఇంటి గోడపై కరపత్రాలు అంటిస్తున్నారు.
అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం ఇటువంటి సమస్యే నెలకొని ఉంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు టీకాలు వేసేందుకు ఈవిదంగానే తిప్పలు పడుతున్నాయి. కనుక భారత్‌లో కూడా ఈ తిప్పలు తప్పవు.