నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎన్నడూ లేనివిదంగా తీవ్ర ఉత్కంట రేపుతున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగనుంది. స్థానిక సంస్థల కోటాలో టిఆర్ఎస్‌ పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ తొలిసారిగా తమ పార్టీ ఓటర్లు చేజారిపోకుండా అందరినీ బెంగళూరుకు తరలించి క్యాంపు రాజకీయాలు నిర్వహించవలసి రావడం విశేషం. 

ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఒక్కో స్థానానికి, కరీంనగర్‌లో రెండు స్థానాలకు నేడు పోలింగ్ జరుగనుంది. మొత్తం ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారి ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,326 మంది ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు ఉంది కనుక అవసరమైతే వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పార్టీకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. కనుక ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగినా టిఆర్ఎస్‌ అభ్యర్ధుల విజయానికి ఢోకా ఉండదు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈనెల 14వ తేదీన ఓట్లు  లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.