
ప్రధాని నరేంద్రమోడీకి సిఎం కేసీఆర్ లేఖ వ్రాశారు. సింగరేణి పరిధిలోని 4 బొగ్గు గనుల వేలంపాటను నిలిపివేయాలని దానిలో కోరారు. సింగరేణిలో ఏడాదికి 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినందున విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగిందని, ఇటువంటి పరిస్థితులో సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరికాదని పేర్కొన్నారు.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మైనింగ్ లీజులను గతంలో కేంద్రప్రభుత్వం కూడా ఆమోదించిందని లేఖలో గుర్తు చేశారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికులు మూడు రోజులు సమ్మెకు సిద్దం అవుతున్నారని లేఖలో తెలియజేశారు. కనుక సింగరేణి బొగ్గు గనులను వేలం వేసే ఆలోచన విరమించుకొని వాటిని సింగరేణికే అప్పగించాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో బొగ్గు గనులను వేలం వేయబోతోంది. ఆ జాబితాలో సింగరేణి పరిధిలో గల కేకే-6, యూజీ బ్లాక్, శ్రావణ్‌పల్లి ఓసీ, జేబీఆర్వోసీ-3, కోయగూడెం ఓసీ-3 బ్లాక్‌లను కూడా చేర్చింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్‌కు అనుబందంగా ఉన్న గుర్తింపు యూనియన్ తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం డిసెంబర్ 9 నుంచి మూడు రోజులు సమ్మెకు నోటీస్ ఇచ్చింది. కేంద్రప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే సమ్మె ఉదృతం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు. ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ ఈ లేఖ వ్రాశారు.