
ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ప్రతిష్టంభన ఏర్పడినందున, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి దీనిపై స్పష్టత కోరుతూ లోక్‌సభలో ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఈ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయన నిన్న లోక్‌సభలో దీనిపై స్పందిస్తూ, “తెలంగాణ రాష్ట్రంలో వరితో సహా ఏ పంటలపై కేంద్రం ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఎలాంటి నిబందనలు పెట్టలేదు. 2021 యాసంగి వరిసాగుపై కూడా ఎటువంటి ఆంక్షలు విధించలేదు,” అని స్పష్టం చేశారు.
అయితే ఇకపై బాయిల్డ్ రైస్ కొనుగోలుచేయబోమని, కనుక వచ్చే యాసంగి సీజనులో పంట మార్పిడి చేసుకొంటే మంచిదని కేంద్ర ఆహార, పౌరసరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు కలిసినప్పుడు స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం కేంద్రంవద్ద భారీగా బియ్యం నిలువలు ఉన్నాయని, అదీగాక దేశంలో బాయిల్డ్ రైస్‌కు పెద్దగా డిమాండ్ లేదని కనుక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కేంద్రమంత్రులు చెప్పారు. అందుకే సిఎం కేసీఆర్ కూడా యాసంగిలో పత్తి, నూనె గింజలు, కందులు, పెసలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులను కోరారు. ఒకవేళ రైతులు మిల్లర్లు, వ్యాపారస్తులతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని వరి పండించుకొంటే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పబోదని, వారికి యధాప్రకారం రైతు బంధు పధకం కింద సొమ్ము అందజేస్తుందని కూడా సిఎం కేసీఆర్ చెప్పారు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రైతులను వరి వేయవద్దని ఎటువంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం అవుతోంది.