ఈటలపై క్రిమినల్ చర్యలు తప్పవు: టిఆర్ఎస్‌

హుజూరాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబం అచ్చంపేట, హకీంపేటలో పేదరైతులకు చెందిన 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసినట్లు రెవెన్యూ సర్వేలో గుర్తించామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్ ప్రకటించడంతో మళ్ళీ ఈటలకు, టిఆర్ఎస్‌కు మద్య కొత్త యుద్ధం మొదలైంది. హరీష్ ఆరోపణలను ఈటల దంపతులు ఖండించడమే కాకుండా, టిఆర్ఎస్‌ కార్యకర్తలాగా వ్యవహరించవద్దని హితవు పలికారు. దీనిపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, ముఠా వేణుగోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ ధీటుగా స్పందించారు. 

నిన్న టిఆర్ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ కుటుంబం చేసిన భూకబ్జాలను మెదక్‌ జిల్లా కలెక్టర్‌ పక్కా సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. ఇంతవరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం అంటూ మాట్లాడుతూ ప్రజలను మోసాగిస్తున్న ఈటల రాజేందర్‌ అసలు రూపం దీంతో బయటపడింది. ఒక్క ఎకరం కబ్జా చేసినట్లు నిరూపించినా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెపుతానన్న ఈటల రాజేందర్‌ ఇప్పుడు 71 ఎకరాలకు 71 సార్లు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. ఇకనైనా ఆయన తాము కబ్జాలకు పాల్పడినట్లు ఒప్పుకొని ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఆయన భూకబ్జాలను బయటపెట్టిన జిల్లా కలెక్టర్‌ను, రెవెన్యూ అధికారులను బెదిరించడం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలి. ఈటల రాజేందర్‌ కుటుంబంపై క్రిమినల్ చర్యలు తప్పవు. ఆయన కుటుంబం ఇంకా ఎక్కడెక్కడ భూకబ్జాలు చేసిందో కలెక్టర్‌ దర్యాప్తు చేసి కనుగొవాలి. భూకబ్జాలకు పాల్పడిన ఈటల రాజేందర్‌ను బిజెపి తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలి“ అని అన్నారు.