.jpg)
మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ చేసిన ఆరోపణలపై హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెంటనే స్పందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో బిజెపి పధాధికారుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మా జమునా హ్యాచరీస్ భూముల్లో ఒక్క ఎకరం కబ్జా భూమి ఉన్నట్లు నిరూపించినా నేను ముక్కు నేలకు రాస్తాను. మీడియా సమావేశంలో నా భార్య జమునా చెప్పిన ప్రతీ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ చెప్పినట్లుగా మేము ఒక్క గుంట భూమి కూడా ఆక్రమించలేదు. ఒకవేళ నేనే 70 ఎకరాలు కబ్జా చేయడం నిజమైతే మరి సిఎంగా ఉన్న కేసీఆర్ కొండాపూర్, రంగారెడ్డి వంటి ప్రాంతాలలో ఎన్ని వేలఎకరాలు కబ్జా చేసి ఉంటారు?
అచ్చంపేట, హకీంపేటలో మేము 8 ఎకరాల భూమిని రైతులకు పూర్తిగా డబ్బు చెల్లించి కొనుగోలు చేసి చట్టప్రకారం ధరణీలో రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాము. అక్కడ మా హ్యాచరీస్ పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందాము. తొండలు కూడా గుడ్లు పెట్టని ఆ భూమిని మేము కొనుగోలు చేసి హ్యాచరీస్ స్థాపించి అనేకమందికి ఉపాధి కల్పిస్తుంటే, సిఎం కేసీఆర్ నాపై రాజకీయ కక్షతో సర్వేల పేరుతో వేధిస్తూ జిల్లా కలెక్టర్ చేత తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అన్నాక ఓ వ్యవస్థ...దానికొ పద్దతి...అధికారులు ఉంటారు. వారు ఆ వ్యవస్థకు కట్టుబడి నియమనిబందనల ప్రకారమే పనిచేయాలి కానీ అధికార పార్టీ కార్యకర్తలలాగ పనిచేయడం సరికాదు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం వాటిని నేను ఖండిస్తున్నాను,” అని అన్నారు.