
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసినందున అందుకు తగినట్లుగా ప్రభుత్వోద్యోగులను కొత్త జిల్లాలు, కొత్త జోన్లవారీగా కేటాయించవలసి ఉంది. అయితే కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంలో ఆలస్యం కావడంతో ఉద్యోగుల విభజన ప్రక్రియ కూడా ఆలస్యమైంది.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం జీవో 317 ద్వారా మార్గదర్శకాలను జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలలో వెంటనే వీటి ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలలో ఎన్నికలు పూర్తయిన తరువాత విభజన ప్రక్రియ మొదలవుతుంది. ఉద్యోగుల విభజనకు రెండు కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం అవి ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేస్తాయి.
మార్గదర్శకాలు ఇవే:
గతంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన లోకల్ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం వివిద శాఖలలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను ఖరారు చేయాలి. సీనియారిటీ, పాత క్యాడర్ రెంటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యోగులలో సస్పెన్షన్‌కు గురైనవారిని, శిక్షణలో ఉన్నవారిని, విదేశీ సర్వీసులలో ఉన్నవారినీ ప్రతీ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు జరపాలి. ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి ఆ ప్రకారమే కేటాయించాలి.
కొన్ని జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉంది కనుక ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఒకటి రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే జనవరి నెలాఖరుకి లేదా ఫిబ్రవరి రెండో వారానికి ఈ ప్రక్రియ కొలిక్కి రావచ్చన్న మాట. ఆ తరువాతే అంటే మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని భావించవచ్చు.