
మాజీ మంత్రి, హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మెడకు అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారం చుట్టుకొంది. ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి వాటిలో జమునా హ్యాచరీస్ ఏర్పాటుచేశారని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు.
అచ్చంపేట, హకీంపేటలోని సర్వే నంబర్ 7-82, 130 వరకు అసైన్డ్ భూములు కబ్జా చేసి వాటిలో పెద్దపెద్ద షెడ్లు, వాటికి రోడ్లు కూడా నిర్మించారని తెలిపారు. హకీంపేట్ శివారులోని సర్వే నంబర్ 97, 111లో అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కుటుంబం కబ్జా చేసి ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద కోళ్ళఫారాలు నిర్మించారని, వాటి కోసం అటవీశాఖ ఆధీనంలోని అనేక చెట్లను నరికివేశారని కలెక్టర్ హరీష్ తెలిపారు. అలాగే సర్వే నెంబర్ 81లో 5 ఎకరాలు, సర్వే నంబర్ 130లో మరో మూడు ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కుటుంబం కబ్జా చేసి తమ పేర రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొన్నారని తెలిపారు. మొత్తం 56 మందికి పేద రైతులకు చెందిన 70.33 ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు కబ్జా చేశారని రెవెన్యూ అధికారుల సర్వేలో తేలిందని కలెక్టర్ హరీష్ చెప్పారు. జమునా హ్యాచరీస్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు భారీగా కాలుష్యం కూడా వ్యాపిస్తున్నట్లు గమనించామని చెప్పారు. ఈ అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంపై త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కలెక్టర్ హరీష్ తెలిపారు.