
మరో 20 రోజుల్లో పెళ్ళిచేసుకోబోతున్న ఓ యువకుడు బ్యాంక్ ఏజంట్ల ఒత్తిడి భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషాదఘటన శనివారం సాయంత్రం రాజేంద్రనగర్ పరిధిలో శివారంపల్లిలోని ఆదర్శనగర్లో జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం...మృతుడు అవినాష్ వాగ్డే (25) నగరంలోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన అతని వివాహం జరుగనుంది. కనుక అతనితో సహా ఇంట్లో అందరూ పెళ్ళి పనులలో బిజీగా ఉన్నారు. శనివారం సాయంత్రం అవినాష్ ప్రింటింగ్ ప్రెస్కు వెళ్ళి తన పెళ్ళి శుభలేఖలు ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం ఉదయం తల్లితండ్రులు, సోదరుడితో కలిసి వాటిని నగరంలో బంధుమిత్రులకు పంచిపెట్టాలనుకొన్నాడు.అయితే శనివారం సాయంత్రం అవినాష్ తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లితండ్రులు షాక్కు గురయ్యారు. మరో 20 రోజులలో కొత్త కోడలు ఇంటికి వస్తుందనుకొంటే చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోవడం వారు తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇంతకీ అవినాష్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడంటే, అతను ఓ బ్యాంక్ నుంచి సుమారు 10 లక్షలు అప్పు తీసుకొన్నాడు. దాని వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతుండటంతో తరచూ బ్యాంక్ ఏజంట్లు ఫోన్లు చేస్తూ, ఇంటికి వస్తూ అతనిపై ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా కాలంగా సాగుతున్నట్లు అవినాష్ సోదరుడు సంతోష్ చెప్పాడు. బ్యాంక్ ఒత్తిళ్ళు భరించలేకనే తన సోదరుడు ఆత్మహత్య చేసుకొన్నాడని, అతని మరణానికి బ్యాంకులే కారకులని సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అవినాష్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ తప్పు అప్పు తిరిగి చెల్లించమని అడుగుతున్న బ్యాంకుదా...లేదా అప్పుచేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకొన్న అవినాష్దా?