తెలంగాణలో మూడు రోజులు సంతాప దినాలు

సిఎం కేసీఆర్‌ శనివారం ఉదయం ఎస్ఆర్‌ నగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని, రోశయ్య మృతికి సంతాపంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు సంతాపదినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎస్ సోమేష్ కుమార్‌ జిల్లా కలెక్టర్లకు తెలియజేశారు.

రేపు (ఆదివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌, మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సంబందిత శాఖల అధికారులు, పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అనేక అత్యున్నత పదవులు చేపట్టి చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొన్న రోశయ్య మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ అధిష్టానం, అధికార, ప్రతిపక్ష నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు సందర్శనార్దం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని గాంధీభవన్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి 12.30 గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.