
సిఎం కేసీఆర్ మొన్న ప్రగతి భవన్లో మళ్ళీ ప్రెస్‌మీట్ పెట్టి కేంద్రాన్ని, కేంద్రమంత్రులను తిట్టిపోయడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “హుజూరాబాద్ ఓటమితో సిఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. దాంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన మాట్లాడే భాషను చూసి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఏ విషయంపైనైనా పూర్తి అవగాహనతో మాట్లాడుతారు. ప్రత్యర్ద పార్టీల నేతలపై విమర్శలు చేసినప్పుడు కూడా ఎక్కడా నోరు జారకుండా చాలా హుందాతనం పాటిస్తారు. కేంద్రమంత్రిగా ఉన్న అటువంటిని వ్యక్తిని సిఎం కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు.
సిఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్మీట్లో పాకిస్తాన్, బాంగ్లాదేశ్ అంటూ చాలా కలవరించడం చూస్తే ఆ దేశాలలో ఆయన ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. మన దేశంలో ఓ రాష్ట్ర జనాభా అంత ఉండదు బంగ్లాదేశ్, పాకిస్థాన్ జనాభా. కనుక ఆ ప్రకారమే హంగర్ ఇండెక్స్‌లో వాటి ర్యాంకులు ఉంటాయి. కానీ సిఎం కేసీఆర్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మన దేశం దిగజారిపోయిందని మాట్లాడి ప్రపంచదేశాలలో భారత్ పరువు తీస్తున్నారు.
ఇక బాయిల్డ్ రైస్ విషయంలోనూ సిఎం కేసీఆర్ ప్రజలను, రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు. కేంద్రంతో 40 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌కు ఒప్పందం చేసుకొని ఇప్పుడు హటాత్తుగా కోటి టన్నులు తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కేంద్రప్రభుత్వమైనా అంత బాయిల్డ్ రైస్‌ను ఒకేసారి ఏవిదంగా కొనగలదు?
యాసంగి సీజనులో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కనుక బాయిల్డ్ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని రా రైస్ పండదని సిఎం కేసీఆర్ అబద్దాలు చెపుతున్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదారు రకాల వరి విత్తనాలు వేసినట్లయితే నిక్షేపంగా రా రైస్ పండుతుంది. కనుక తెలంగాణలో రైతులు వచ్చే యాసంగి సీజనులో ఆ ఐదారు రకాల వరి విత్తనాలు వేసి నిర్భయంగా రా రైస్ పండించవచ్చు,” అని బండి సంజయ్ అన్నారు.