
ధాన్యం కొనుగోలు అంశంపై సిఎం కేసీఆర్ మళ్ళీ మొన్న ప్రగతి భవన్లో ప్రెస్‌మీట్ కేంద్రప్రభుత్వాన్ని, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ‘చేతకాని చవటలు, దద్దమ్మలు, సిగ్గూ లజ్జా, బుద్ధి జ్ఞానం లేనివాళ్ళు...’అంటూ దూషించడంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగనివిదంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. నా గురించి ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. నేను ఏమిటో... ఎటువంటివాడినో ప్రజలకు తెలుసు. సిఎం కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. వారే ఆయనకు తగినవిదంగా బుద్ధి చెపుతారు.
నాకు కేంద్రమంత్రిననే అహంకారం లేదు. ఎందుకంటే ఈ పదవి ఎల్లకాలం ఉండదు. నాకు నా పార్టీ, రాష్ట్రం, ప్రజలే ముఖ్యం. మొదటి నుంచి కూడా నాది ఇదే విధానం. నా స్వయంకృషితోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. కానీ ఒక సామాన్య రైతుబిడ్డనైనా నేను ఈ స్థాయికి ఎదగడం సిఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతునట్లున్నారు. తెలంగాణ బిడ్డనైనా నేను కేంద్రమంత్రి అవడం కేసీఆర్‌కు ఇష్టం లేనట్లుంది.
నేను కేంద్రమంత్రిగా రాష్ట్రం కోసం చేయగలిగినంతా చేస్తున్నాను. ఈవిషయంలో సిఎం కేసీఆర్‌తో మాట్లాడుదామనుకొంటే ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉన్నతాధికారులు కూడా నన్ను ఏనాడూ కలవలేదు. సిఎం కేసీఆర్‌తో సహా ప్రభుత్వంలో అందరూ నాపట్ల అవమానకరంగానే వ్యవహరిస్తున్నా నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోతున్నాను.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడిన తరువాతే నేను రాష్ట్రంలో రైతుల దగ్గరకు వెళ్ళి మాట్లాడాను. కళ్ళాలలో ధాన్యం పోసుకొని బాధపడుతున్న రైతులను ఓదార్చి, ఈ సీజనులో పండిన ధాన్యం కేంద్రమే కొనుగోలు చేస్తుందని అధైర్యపడవద్దని చెప్పాను. కానీ సిఎం కేసీఆర్ నా గురించి వేరే విదంగా మాట్లాడారు.
రాష్ట్రంలో వరిసాగు, ధాన్యం కొనుగోలుపై బహిరంగ చర్చకు రావాలని సిఎం కేసీఆర్ విసిరిన సవాలును నేను స్వీకరిస్తున్నాను. సీనియర్ పాత్రికేయుల సమక్షంలో అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు నేను సిద్దం. అయితే ఈ చర్చలో ఆయన అసభ్యకరమైన భాషలో మాట్లాడనని హామీ ఇవ్వాలి. ఈ ఒక్క విషయంలో నేను ఆయనతో పోటీ పడలేను.
హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఓటమితో ఆయనకు పెద్ద షాక్ తగిలింది. అప్పటి నుంచే ఆయన తీవ్ర అభద్రతాభావంతో బాధపడుతున్నారు. అందుకే ఆయన తరచూ ప్రెస్మీట్లు పెట్టి మరీ కేంద్రప్రభుత్వాన్ని, కేంద్రమంత్రులను, రాష్ట్ర బిజెపి నేతలను తిడుతున్నారు. ఈవిషయం అందరికీ తెలుసు,” అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.