ధాన్యం కొనుగోలుపై కేంద్రం ఏమి చెప్పిందంటే...

తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి తెలుసుకొనేందుకు ఢిల్లీలో వేచి చూస్తున్న రాష్ట్ర మంత్రులు శుక్రవారం రాత్రి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. అయితే జాతీయస్థాయిలో వరి ఉత్పత్తి, దేశ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కనుక తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లుగా ధాన్యం కొనుగోలుపై ఇప్పటికిప్పుడు ఎటువంటి హామీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. వానాకాలంలో పండిన 40 లక్షల టన్నుల ధాన్యం తీసుకొంటామని, వీలైతే అదనంగా మరో 10 లక్షల టన్నులు తీసుకొంటామని పీయూష్ గోయల్‌ మంత్రులకు చెప్పారు.

వచ్చే యాసంగి సీజనులో వరి వేయవద్దని, రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని కోరారు. ఇక నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యపై తెలంగాణ మంత్రులు చెప్పినది సబబుగానే ఉందని, ఈ సమస్య శాశ్విత పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఓ కమిటీ వేస్తామని పీయూష్ గోయల్‌ తెలిపారు. వ్యవసాయ, పౌరసఫరా శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ దీనిపై అధ్యయనం చేసి వార్షిక ప్రణాళిక రూపొందిస్తుందని, ధాన్యం కొనుగోలు, మద్దతు ధర తదితర అంశాలకు సంబందించి విధివిధానాలు రూపొందిస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ తెలంగాణ మంత్రులకు చెప్పారు.