ధాన్యం కొనుగోలుపై 26న మరో సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులతో చర్చించేందుకు సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందం మొన్న ఆదివారం ఢిల్లీ వెళ్ళింది. సిఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు తదితరులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ అనిల్ కుమార్‌, వ్యవయసాయ శాఖ కమీషనర్‌ రఘునందన్ రావు తదితరులు మంగళవారం వ్యవయసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. 

ఇరువురు కేంద్ర మంత్రులతో చాలా సుదీర్గంగా సమావేశాలు సాగాయి. ప్రధానంగా ఈ వర్షాకాలం సీజనులో పండిన ధాన్యం అంతా కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని టిఆర్ఎస్‌ మంత్రులు, అధికారుల బృందం వారిని కోరింది. అలాగే ఇక నుంచి ఏడాదికి ఎంత ధాన్యం కొనుగోలు చేస్తుందో ముందే ప్రకటించాలని వారు కేంద్రమంత్రులను కోరారు. ఈ ప్రతిపాదనకు వారు సానుకూలంగా స్పందించారు. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేస్తామని తెలిపారు. బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేనందున ఇకపై కొనుగోలుచేయలేమని స్పష్టం చేశారు. అయితే గత ఏడాదిలో తీసుకోవలసి ఉన్న 5.25 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను మాత్రం తీసుకొంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ హామీ ఇచ్చారు. ఈ వర్షాకాలం సీజనులో పండిన ధాన్యం కొనుగోలుపై ఈనెల 26న మరోసారి సమావేశమై చర్చిద్దామని ఆలోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకొని తెలియజేస్తామని తెలిపారు.