ఇంకా ఢిల్లీలోనే సిఎం కేసీఆర్‌ బృందం

ధాన్యం కొనుగోలు, తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన పలు సమస్యలపై కేంద్రప్రభుత్వంతో మాట్లాడేందుకు ఆదివారం ఢిల్లీకి వెళ్ళిన సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఉన్నతాధికారుల బృందం ఇంకా అక్కడే ఉంది. ఇవాళ్ళ సాయంత్రం వారు కేంద్ర పౌరసరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు. అలాగే ఇక నుంచి కేంద్రం ఏటా యాసంగి, వర్షాకాల సీజన్లలో తెలంగాణ నుంచి ఏ రకం...ఎంత ధాన్యం కొంటుందో ముందే ప్రకటిస్తుండాలని కోరనున్నారు. 

సిఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు సోమవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండేని కలిసి తక్షణం రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని లేకుంటే లక్షలాదిమంది రైతులు తీవ్రంగా నష్టపోతారని విజ్ఞప్తి చేశారు. 

ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ లభిస్తే సిఎం కేసీఆర్‌ ఆయనతో భేటీ అయ్యి ఈ సమస్యలన్నిటినీ వివరించి పరిష్కరించవలసిందిగా కోరనున్నారు. లేకుంటే కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చి వెనక్కు తిరిగివస్తారు.