పెళ్ళిలో కలిసి కబుర్లు చెప్పుకున్న కేసీఆర్‌, జగన్

ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ సుమారు నాలుగు నెలలు తరువాత తొలిసారిగా నిన్న (ఆదివారం) తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనుమరాలి వివాహంలో కలిసి టీ త్రాగుతూ మాట్లాడుకున్నారు. శంషాబాద్‌ వద్ద కొత్తగూడలో విఎన్‌ఆర్‌ ఫామ్స్ లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ముందుగా సిఎం కేసీఆర్‌, తరువాత జగన్ వచ్చారు. వధూవరులను ఆశీర్వదించిన తరువాత ఇద్దరూ టీ త్రాగుతూ ఏకాంతంగా పది నిమిషాలు మాట్లాడుకున్నారు. 

మరో విశేషమేమిటంటే...“కేంద్రం డబ్బు ఇవ్వకపోతే ఏపీ దివాళా తీస్తుంది కనుక ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ కాళ్ళు పట్టుకొని డబ్బులు అడ్డుకొని తెచ్చుకొంటున్నారు,” అంటూ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సిఎం కేసీఆర్‌ వెంట ఉన్నారు.

“సిఎం కేసీఆర్‌ తరచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు?మేము కేసీఆర్‌లాగ చాటుగా వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ కాళ్ళు పట్టుకోవడం లేదు. మిగులు బడ్జెట్‌తో చేతికి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కేసీఆర్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు,” అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ధీటుగా బదులిచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉన్నారు.