రేపు ఢిల్లీలోనే అమీతుమీ తేల్చుకొంటాం: సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని మేము ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందించడం లేదు. కనుక రేపు (ఆదివారం) కొంతమంది మంత్రులు, అధికారులతో కలిసి ఢిల్లీకి పోయి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని వీలైతే ప్రధానమంత్రిని కలిసి ఈవిషయంపై నేరుగా మాట్లాడి స్పష్టత కోరుతాము. కేంద్రం ఏమి చెప్పిందో తెలుసుకొన్నాక ఆ విషయం మన రైతులకు తెలియజెప్పి తదుపరి నిర్ణయం తీసుకొంటాము. కనుక మేము ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే వరకు రైతులను కాస్త వేచి ఉండమని కోరుతున్నాను. ఈ వర్షాకాలంలో పండిన ప్రతీ బియ్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది. దీనికి మేము కట్టుబడి ఉన్నాము. కనుక రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదు. 

కేంద్రంతో మాట్లాడవలసిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కృష్ణా గోదావరి నదీజలాలలో తెలంగాణ వాటా ఎంతో తేల్చి చెప్పాలని ఏడేళ్ళుగా కోరుతున్నాము. ట్రిబ్యూనల్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ అవరోదంగా ఉందన్నారు. దానిని మేము ఉపసంహరించుకొన్నాము. కనుక తక్షణమే ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అలాగే బీసీ కులగణన చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని కోరబోతున్నాము. 

వ్యవసాయ చట్టాలతో ఏవిదంగా రైతులకు నష్టం కలుగుతుందో అదేవిదంగా కేంద్రప్రభుత్వం తెచ్చిన కొత్త విద్యుత్ చట్టంతో కూడా నష్టం కలుగుతుంది. కనుక దానిని కూడా రద్దు చేయాలని కోరబోతున్నాము. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాష్ట్రానికి ఆ శక్తి ఉంది. కనుక కేంద్రం బలవంతంగా రైతు వ్యతిరేక విద్యుత్ చట్టాన్ని మా నెత్తిన రుద్దవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కావాలనుకుంటే మీ బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలుచేసుకోండి. కాదని అన్ని రాష్ట్రాలలో బలవంతంగా అమలుచేయాలని ప్రయత్నిస్తే మళ్ళీ దానిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలవడం ఖాయం. 

మేము కోరుతున్న ఈ డిమాండ్స్ అన్ని న్యాయమైనవే కనుక వాటిని అమలుచేయాలని కేంద్రానికి సవినయంగా మనవి చేస్తున్నాను. కానీ రాష్ట్రంలో రైతులు ఏమైపోయినా పర్వాలేదు మా ఇష్టం వచ్చినట్లు మేమే చేస్తాం భరించండి అంటే మాకు ఇక ఓపిక లేదు. తప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం,” అని చెప్పారు.