మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టను: చంద్రబాబు శపధం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకి ఈరోజు శాసనసభలో చాలా చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను ఉద్దేశ్యించి చాలా అసభ్యంగా మాట్లాడుతూ హేళన చేశారు. వారిలో కొందరు ఆయన భార్యనుద్దేశ్యించి అసభ్యంగా మాట్లాడారు. దీంతో చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన సుదీర్గమైన రాజకీయ జీవితంలో ఎంతోమంది హేమాహేమీలతో కలిసి పనిచేశానని కానీ వారిలో ఎవరూ ఇంత నీచానికి దిగజారలేదని అన్నారు. రాజకీయాలతో సంబందంలేని తన భార్య పట్ల వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడుతుంటే వారిని వారించవలసిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చిర్నవ్వులు చిందిస్తున్నారని, తాను అభ్యంతరం చెప్పబోతే సభాధ్యక్షుడు తన మైక్ కట్ చేశారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలలో ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై సభలో చర్చించవలసిన బాధ్యత తమపై ఉంది కనుక చాలా ఓపికగా భరించామని అన్నారు. కానీ ఈరోజు సభలో తమకు జరిగిన అవమానాన్ని భరించలేకపోతున్నామని, కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడే శాసనసభలో అడుగుపెడతానని చంద్రబాబునాయుడు శపదం చేసి సభ నుంచి వాకవుట్ చేసి వెళ్ళిపోయారు.