టిఆర్ఎస్‌-బిజెపి జేఏసీ: రేవంత్‌ రెడ్డి

ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రాన్ని హోరెత్తించేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా గురువారం పబ్లిక్ గార్డెన్స్ నుంచి బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ కమీషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ పరస్పరం కత్తులు దూసుకొంటున్నట్లు డ్రామాలు ఆడుతున్నప్పటికీ ఆ రెండూ కలిసి రాష్ట్రంలో రైతులను మభ్యపెట్టేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా పనిచేస్తున్నాయి. కేంద్రం సూచనల ప్రకారమే కేసీఆర్‌ ధర్నా చేశారు. కేసీఆర్‌కు రైతుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ది ఉంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలి. ఇక్కడ కాదు. అక్కడ రైతులు ధాన్యం రోడ్లపై పోసుకొని ఎదురుచూస్తుంటే వారి వద్ద నుంచి ధాన్యం కొనకుండా సిఎం కేసీఆర్‌ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. సహారా కుంభకోణంలో సిఎం కేసీఆర్‌ను జైలుకి వెళ్ళకుండా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలే కాపాడుతున్నారు.         బండి సంజయ్‌ రాష్ట్రంలో తిరిగితే ఏం ప్రయోజనం? ఢిల్లీకి వెళ్ళి తమ పార్టీ అధిష్టానాన్ని, కేంద్రప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలుకి ఒప్పించాలి. లేకుంటే అక్కడే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి,” అని అన్నారు.  

భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకపోతే చైనా, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు వచ్చి కొంటాయా? కేంద్రప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిందని భారత్‌ బంద్‌లో పాల్గొన్న టిఆర్ఎస్‌, అప్పటి నుంచి ఆ చట్టాల ఊసే ఎత్తలేదు. టిఆర్ఎస్‌ నిజంగా వాటిని వ్యతిరేకిస్తునట్లయితే శాసనసభలో తీర్మానం చేసి పంపించి ఉండేది. కానీ పంపలేదు. మళ్ళీ ఇప్పుడు అవి నల్ల చట్టాలని...వాటిని అడ్డుకోవడానికి పోరాడుతానని సిఎం కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్‌కు పాలన చేతకాకుంటే తక్షణం రాజీనామా చేసి దిగిపోవాలి కానీ రైతుల సమస్యల పరిష్కారం కోసం అంటూ రోడ్లపై కూర్చొని ధర్నాలు చేయడం ఏమిటి? వీటితో ఆయన ఎవరిని మభ్యపెట్టాలనుకొంటున్నారు?ఇకనైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ డ్రామాలు కట్టిపెట్టి తక్షణం రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాలను ఇంకా ఉదృతం చేస్తుంది,” అని అన్నారు. 

ఈ ర్యాలీలో సీనియర్ కాంగ్రెస్‌ నేతలందరూ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలిరావడంతో ర్యాలీ విజయవంతమైంది.