ఆరోజు వద్దన్న ధర్నాచౌక్ వద్దే కేసీఆర్‌ ధర్నా!

కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఈరోజు టిఆర్ఎస్‌ ధర్నా చేయడంపై అప్పుడే ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు ఇందిరా పార్క్ వద్ద ఎవరూ ధర్నాలు చేయడానికి వీల్లేదని, దాని వలన శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ ధర్నాచౌక్ ఎత్తివేయించారు. కానీ ఈరోజు సిఎం కేసీఆర్‌ అక్కడే ధర్నా చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఓటమితో ఆయన గ్రాఫ్ పడిపోవడంతో దానిని కవర్ చేసుకొనేందుకే మహాధర్నా పేరుతో హడావుడి చేస్తున్నారు. గతంలో వ్యవసాయ చట్టాలు బాగున్నాయని చెప్పిన కేసీఆరే ఇప్పుడు అవి బాగోలేవని యూ టర్న్ తీసుకొన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతీ బియ్యం గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు కేంద్రప్రభుత్వమే కొనాలంటూ మరో యూ టర్న్ తీసుకొని, ఈ మహాధర్నాతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్‌ జిమ్మిక్కులు అర్ధం చేసుకోలేనంత అమాయకులుకారు రాష్ట్ర ప్రజలు. హుజూరాబాద్‌ ఫలితమే ఇందుకు తాజా నిదర్శనం,” అని ఎమ్మెల్యే రాజా సింగ్‌ అన్నారు.        

మరో బిజెపి మహిళా నేత విజయశాంతి స్పందిస్తూ, “కేంద్రప్రభుత్వం బాయిల్డ్ రైస్ తప్ప వేరే రకం బియ్యం కొంటామని పదేపదే చెపుతున్నా, కేంద్రప్రభుత్వం బియ్యం కొనాలంటూ సిఎం కేసీఆర్‌ ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉంది. రైస్ మిల్లర్ల నుంచి భారీగా కమీషన్లు ముడుతున్నందునే సిఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనాలని ఇంతగా పట్టు పడుతున్నారు. ప్రస్తుతం రైతులు రోడ్లపై పోసుకొన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుంటే వాటిని కొనుగోలు చేయకుండా వచ్చే యాసంగిలో చేతికి వచ్చే బియ్యం గురించి కేసీఆర్‌ ఇప్పుడు ధర్నా చేయడం ఏమిటి?రాష్ట్రంలో రైతులను సిఎం కేసీఆరే గోస పెట్టిస్తున్నారు. అయినా దేశంలో ఎక్కడాలేని ధాన్యం సమస్య ఒక్క కేసీఆర్‌కే వచ్చిందా?” అని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.