
ఈరోజు ఇందిరా పార్కులో జరిగిన మహాధర్నాలో పాల్గొన సిఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను ఒకటే మాట అడుగుతున్నాను. తెలంగాణలో పండిన ధాన్యం కొంటారా కొనరా?ఈ ప్రశనకు స్పష్టంగా జవాబు ఇవ్వండి. మేమేమైనా మీకు అర్ధంకాని బాషలో అడుగుతున్నామా జవాబు చెప్పకపోవడానికి?ఒకవేళ ధాన్యం కొనుగోలుచేయదలచకపోతే అదే మాట చెప్పండి. అప్పుడు ఏం చేయాలో అదే చేస్తాము. ధాన్యం కొనుగోలుపై అక్కడ కేంద్రప్రభుత్వం ఒకలాగా, ఇక్కడ రాష్ట్రంలో బిజెపి నేతలు మరొకలాగా మాట్లాడుతూ రైతులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారు?
రైతుల సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే లేదు...యావత్ దేశమంతటా ఉంది. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు దీక్షలు చేస్తుంటే కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేశంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాకానీ కేంద్రప్రభుత్వానికి వాటిని సరిగ్గా వినియోగించుకొనే తెలివి లేదు. కేంద్రప్రభుత్వం అసమర్ధతకు రాష్ట్రాలు ఎందుకు మూల్యం చెల్లించాలి?
మీకు ప్రజా సమస్యల కంటే ఎన్నికలు, అధికారమే ముఖ్యం. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో ప్రజలలో సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గదుపుకుంటున్నారు. రాష్ట్రానికి సంబందించిన అనేక సమస్యలు, అంశాలపై మేము అనేక వినతి పత్రాలు ఇచ్చాము. నేను స్వయంగా కేంద్రమంత్రుల వద్దకు వెళ్ళి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. రాష్ట్రాలకు అండగా నిలువ వలసిన కేంద్రప్రభుత్వం ఇలాగేనా వ్యవహరించేది?ఇప్పటికీ కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మా రైతులను కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడేందుకు సిద్దంగా ఉన్నాము. టిఆర్ఎస్‌కు, తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్తకాదు. అవసరమైతే ఢిల్లీకి వచ్చి అక్కడే పోరాడుతాము. ధాన్యం కొనుగోలు విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదు. కేంద్రానికి 48 గంటలు గడువు ఇస్తున్నాను. ఆ తరువాత ఇక యుద్ధం తప్పదు,” అని సిఎం కేసీఆర్ హెచ్చరించారు.