చిరంజీవి మంచి పనే చేశారు: వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న అమీర్‎పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, ఆ కార్యక్రమంలో చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తెలుగువారైనా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండటం తెలుగు వారందరికీ గర్వకారణమని, ఆయనను రాష్ట్రపతిగా చూడాలనుకొంటున్నారని అన్నారు. 

దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ “చిరంజీవి నాపై అభిమానంతో అలా అన్నప్పటికీ నాకు ఇక ఏ పదవులపై ఆశలేదు. రాజకీయాలపై కూడా ఆసక్తి పోయింది. నిజానికి నాకు ప్రజల మద్య ఉండటమే చాలా ఇష్టం కానీ ఈ ఉప రాష్ట్రపతి పదవితో ప్రోటోకాల్ వలన ప్రజలకు దూరంగా ఉండిపోవలసివస్తోంది. కనుక రాష్ట్రపతి పదవిని నేను ఆశించడం లేదు. ఎవరూ అటువంటి ప్రతిపాదన చేయలేదు కూడా. చిరంజీవి రాజకీయాలను విడిచిపెట్టి చాలా మంచి పనిచేశారని నేను భావిస్తున్నాను. చక్కగా కళామతల్లి సేవ చేసుకొంటూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి ఎవరికైనా?” అని అన్నారు.              

స్వర్గీయ ఎన్టీఆర్ స్పూర్తితో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం, తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలుసు. చిరంజీవి రాజకీయాలలో ప్రవేశించి ఎంత అప్రదిష్ట మూటగట్టుకున్నారో, మళ్ళీ సినీ రంగంలో ప్రవేశించాక మళ్ళీ మంచి పేరు, గౌరవం పొందుతున్నారు. కనుక ఆయన గురించి వెంకయ్య నాయుడు చెప్పింది నిజమే అని భావించవచ్చు.