తెలంగాణ డబ్బు కావాలి కానీ ధాన్యం వద్దా? కేటీఆర్‌ ప్రశ్న

తెలంగాణ ఐ‌టి, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ బుదవారం సిరిసిల్లా జిల్లాకేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం, రాష్ట్ర బిజెపి నేతలు ధాన్యం సేకరణ, కొనుగోలు విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఒక్క కేజీ ధాన్యం కూడా కొనమని చెపుతుంటే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్రంలో రైతులు ధాన్యమే పండించాలని, కేంద్రప్రభుత్వం దానిని కొనుగోలు చేస్తుందని చెపుతున్నారు. మళ్ళీ అదే నోటితో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుచేయాలని మాట్లాడుతూ రైతులను రెచ్చగొడుతున్నారు. బండి సంజయ్‌ రెండు రకాలుగా మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారు. ఆయనకు దమ్ముంటే యాసంగి సీజనులో కేంద్రప్రభుత్వం ఎంత ధాన్యం కొంటుందో లేఖ తీసుకురావాలి. లేకుంటే బేషరతుగా ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెప్పాలి. అయినా కేంద్రప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో చెల్లిస్తున్న లక్షల కోట్లు డబ్బు కావాలి కానీ ధాన్యం అక్కరలేదా?

రాష్ట్రాలకు అండగా నిలబడవలసిన కేంద్రప్రభుత్వమే ఈవిదంగా వ్యవహరిస్తుండటం సరికాదు. అందుకే రాష్ట్ర ప్రజలు, రైతుల తరపున కేంద్రానికి నిరసన తెలిపేందుకు మా ప్రభుత్వం ఇవాళ్ళ సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేయబోతోంది. దీనిని విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులను కోరుతున్నాను,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.