ప్రధాని మోడీకి సిఎం కేసీఆర్‌ లేఖ

ప్రధాని నరేంద్రమోడీకి సిఎం కేసీఆర్‌ ఈరోజు లేఖ వ్రాశారు. తెలంగాణ రాష్ట్రంలో 2020-21 రబీ సీజనులో మిగిలిన 5 లక్షల టన్నుల ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆదేశించవలసిందిగా సిఎం కేసీఆర్‌ లేఖలో కోరారు. అలాగే 2021-222 ఖరీఫ్ సీజనులో పండే 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయవలసిందిగా కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న సందిగ్దత కారణంగా రాష్ట్రంలో లక్షలాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కనుక ఏ సీజనులో ఏ రకం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని లేఖలో కోరారు. 

గత ఏడేళ్ళుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు, పధకాలు, ప్రోత్సాహకాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడి గణనీయంగా పెరిగిందని, ప్రతీ ఏడాది అది మరింత పెరుగుతోందని తెలిపారు. కానీ ఇప్పుడు కేంద్రప్రభుత్వం రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుచేయడానికి వెనకాడుతోందని, ఇది సరికాదని దీని వలన రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో తాను స్వయంగా ఢిల్లీకి వచ్చి ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఈ సమస్యపై చర్చించి, ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరానని కానీ ఇంతవరకు ఆయన నుంచి సమాధానం రాలేదని లేఖలో పేర్కొన్నారు. కనుక తక్షణం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ లేఖ ద్వారా ప్రధాని నరేంద్రమోడీని కోరారు.