
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించింది. ఈ అంతర్జాతీయ అవార్డు కోసం భారత్ నుంచి మూడు గ్రామాలు పోటీ పడగా వాటిలో భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ (ఐక్యరాజ్య సమితికి అనుబంద సంస్థ) ఎంపిక చేసింది. వచ్చే నెల 2వ తేదీన స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్‌లో ఈ అవార్డును అందజేస్తారు.
పోచంపల్లి చీరలకు ప్రసిద్ది అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ నేసే ఇక్కత్ చీరలకు దేశవిదేశాలలో చాలా డిమాండ్ ఉంది. పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఇక్కడ నేసే చీరల కోసం దేశం నలుమూలల నుంచి వ్యాపారులు, వినియోగదారులు వస్తుంటారు. ఒకప్పుడు జరిగిన భూదాన ఉద్యమాల కారణంగా పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా మారింది.