
సిఎం కేసీఆర్ ఈరోజు ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి పార్టీ టికెట్లు అందజేయడంతో అందరూ ఈరోజే నామినేషన్లు వేస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్ధులు వీరే.. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్ రామిరెడ్డి( సిద్దిపేట మాజీ కలెక్టర్), తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, బండ ప్రకాశ్ (రాజ్యసభ సభ్యుడు).
బండ ప్రకాశ్‌ను శాసనమండలికి పంపించి ఆ స్థానంలో కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సిఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేసినప్పటికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిని ఆమోదించకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి పంపిస్తున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఇవి ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎన్నికలు గనుక ఆరుగురు అభ్యర్ధులకు టికెట్లు లభించడంతోనే ఎమ్మెల్సీలుగా అయినట్లే. కనుక నామినేషన్లు, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు అన్నీ లాంఛనప్రాయమే.