తీన్‌మార్ మల్లన్న ఆరోపణలు అబద్దం: జైల్ అధికారి

చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్న తాను చంచల్‌గూడా జైలులో ఉండగా జైలు అధికారులు పాత నేరస్తుల సాయంతో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, ఆ తరువాత తనను ఓ చీకటి గదిలో బందించారని ఆరోపించారు. జైల్లో ఉన్నప్పుడు తనకు మానసికరోగులకు ఇచ్చే ఇంజెక్షన్లు ఇచ్చి పిచ్చివాడిని చేసేందుకు కూడా జైలు అధికారులు ప్రయత్నించారని ఆరోపించారు. ఆయన ఆరోపణలను చంచల్‌గూడా జైలు ఇన్‌-ఛార్జ్ డా.శ్రీనివాస్ ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

“ఆయనపై జైలులో ఎటువంటి హత్యాయత్నం జరుగలేదు. ఆయనకు సంబందంలేని ఎటువంటి మందులు ఇవ్వలేదు. చంచల్‌గూడా జైల్లో ఖైదీలకు భద్రత కల్పించడం మా బాధ్యత. కనుక వారి భద్రతకు సిబ్బంది ఉన్నారు. జైల్లో ప్రతీ ఖైదీకి ఒక కేస్ షీట్ ఉంటుంది. దానిలో ఆ ఖైదీ ఆరోగ్య సమస్యలు, చికిత్స, వాడిన మందులు, చికిత్స చేసిన వైద్యుల పేర్లు వగైరా పూర్తి వివరాలు నమోదు చేయబడతాయి. కనుక తీన్‌మార్ మల్లన్నకు సంబందంలేని మందులు ఇచ్చే అవకాశమే లేదు. ఇక చంచల్‌గూడా జైల్లో ఎక్కడా చీకటి గదులు లేవు. కనుక ఆయనను చీకటి గదిలో బందించామన్న ఆరోపణ కూడా అవాస్తవం,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.