తెలంగాణకు 12 స్వచ్చా అవార్డులు

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చభారత్ మిషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వివిద విభాగాలలో 12 అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా 4,300 నగరాలు, పట్టణాలు శానిటేషన్ ఛాలెంజ్‌లో పోటీ పడగా తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు లభించాయి. ఈనెల 20న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా తెలంగాణ మున్సిపల్ ఉన్నతాధికారులు ఈ అవార్డులను అందుకోబోతున్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం మసాబ్ ట్యాంక్‌ వద్దగల సీడీఎంఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఏడేళ్ళలో రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పన, పరిశుభ్రత, పచ్చదనం పెంచడానికి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారం వంటి పలు పధకాలు, కార్యక్రమాలను అమలుచేశాం. మున్సిపల్, పంచాయితీరాజ్ చట్టాలను ప్రక్షాళన చేసి సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాము. మున్సిపాలిటీల సంఖ్య 68 నుంచి 142కి పెంచడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పార్కులు, వైకుంఠధామాలు, పట్టణాలలో అర్బన్ లంగ్ స్పేస్ పేరిట పచ్చటి మొక్కలతో నిండిన పార్కులు, వెజ్, నాన్-వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, పబ్లిక్ జిమ్ సెంటర్లు, భవనాల వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసే పరిశ్రమలను, శాస్త్రీయపద్దతులలో డంపింగ్ యార్డులు వగైరా అనేకానేక సదుపాయాలు కల్పించాము. రాజధాని మొదలు గ్రామస్థాయి వరకు పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చాం. వీటికోసం ప్రభుత్వం రూ.2,950 కోట్లు ఖర్చు చేసింది. మిషన్ భగీరధ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ సురక్షితమైన మంచి నీటిని అందజేస్తున్నాము. 

ఈ ఏడేళ్ళలో సిఎం కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి అమలుచేసిన ఈ కార్యక్రమాలు, పధకాల వల్లే నేడు రాష్ట్రానికి ఇన్ని అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలుస్తోంది. రాష్ట్రానికి ఇన్ని అవార్డులు, ఇంత గుర్తింపు లభించడానికి అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారు. ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.