కేసీఆర్‌ విమర్శలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ జవాబు

ఇటీవల సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, బోర్డుల పరిధిలో ప్రాజెక్టులు తీసుకురావడం, ట్రిబ్యూనల్ ఏర్పాటు తదితర అంశాలపై కేంద్రప్రభుత్వం తీరును నిశితంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ పేరును కూడా ప్రస్తావించడంతో ఆయన స్పందించారు. 

“కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం రెండు తెలుగు రాష్ట్రాలను సంప్రదించిన తరువాతే కేఆర్‌ఎంజీ, జీఆర్‌ఎంబీ బోర్డులను ఏర్పాటు చేశాము. బోర్డులకు ప్రాజెక్టులు అప్పగింతపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు పేర్కొన్నాం. 

ట్రిబ్యూనల్ ఏర్పాటుపై కేసీఆర్‌ అబద్దాలు చెపుతున్నారు. ఈ విషయంలో ఆయన మాటలన్నీ ఓ డ్రామాను తలపిస్తున్నాయి. ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని 2020లో సిఎం కేసీఆర్‌ కోరగా అందుకు మేము సిద్దంగా ఉన్నామని తెలిపాము. అయితే తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున నిర్ణయం తీసుకోలేము కనుక ముందుగా దానిని ఉపసంహరించుకోవాలని సూచించాము. రెండు రోజులలోనే ఆ పిటిషన్‌ ఉపసంహరించుకొంటామని 2020, అక్టోబర్ 6వ తేదీన నాకు కేసీఆర్‌ చెప్పారు. కానీ ఇప్పటివరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకోలేదు. కనుక ట్రిబ్యూనల్ ఏర్పాటులో ఆలస్యానికి ఆయనే కారణం తప్ప కేంద్రప్రభుత్వం కాదు. కానీ ఆయన ఈ విషయం దాచిపెట్టి ప్రెస్‌మీట్‌లో అబద్దాలు చెపుతూ కేంద్రాన్ని నిందించారు,” అని అన్నారు.