కిషన్‌రెడ్డి స్థాయికి ఇది తగదు: మంత్రి హరీష్‌రావు

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల నేతలు, రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు కూడా పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూనే ఉన్నారు. తాజాగా రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. 

మంత్రి హరీష్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బీబీ నగర్‌లో ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్థలం ఇవ్వలేదని కిషన్‌రెడ్డి అబద్దాలు ట్వీట్ చేశారు. కానీ జనవరి 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం నీమ్స్ హాస్పిటల్‌ భవనంతో పాటు 201 ఎకరాల భూమిని అప్పగించింది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్నకిషన్‌రెడ్డి ఈవిదంగా అబద్దాలు చెప్పడం తగదు. కనుక తక్షణం ఆయన తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి తన హుందాతనం కాపాడుకోవాలి. ఈ విషయంలో ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్‌కు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించాలి.

కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా 21 కాలేజీలను నిర్మింపజేస్తోంది. ఇంకా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, నవోదయ విద్యాలయాల విషయంలో కేంద్రం తెలంగాణకు హ్యాండిచ్చింది.

వడ్లు కొనుగోలుపై కేంద్రం ఓ మాట, రాష్ట్ర బిజెపి నేతలు మరో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై రాష్ట్ర బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. రాష్ట్ర బిజెపి నేతలు,  కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వారి తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు,” అని అన్నారు.