5.jpg)
ధాన్యం కొనుగోలు వ్యవహారంలో సిఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వ తీరును తప్పు పడుతూ తీవ్రంగా విమర్శించి, ఢిల్లీలో ధర్నాలు చేస్తామని హెచ్చరించడంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకి ఎవరూ భయపడరు. ధాన్యం సేకరణ విషయంలో సిఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెపుతూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ధాన్యం సేకరణలో వాస్తవాలు ఏమిటంటే...దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధికంగా కేంద్రప్రభుత్వం ధాన్యం సేకరిస్తోంది. 2014లో 43 లక్షల టన్నులు సేకరించగా 2020-2021లో తెలంగాణ నుంచి 94 లక్షల టన్నులు ధాన్యం సేకరిస్తోంది. ధాన్యం సేకరణ, గోనె సంచులు, మిల్లింగ్ ఖర్చులను కూడా కేంద్రప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రాలపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. ధాన్యం సేకరణకు కేంద్రప్రభుత్వం 2020-2021లో రూ.26,646 కోట్లు ఖర్చు చేస్తోంది.
బాయిల్డ్ రైస్‌ను రైతులు పండించరు. బియ్యాన్ని ఆడించి మిల్లర్లు దానిని తయారుచేస్తారు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్రజలు మాత్రమే బాయిల్డ్ రైస్ తింటారు. మిగిలిన రాష్ట్రాలలో తినరు. కనుక డిమాండ్ లేని పంటను తగ్గించి రారైస్ పండించమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించగా అందుకు అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా ఓ లేఖ కూడా ఇచ్చింది. రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ పండించడం తగ్గించి రారైస్ పండిస్తామని, వీలైనంత త్వరగా రైసు మిల్లుల సామర్ధ్యాన్ని కూడా పెంచుకొంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
కానీ ఇప్పుడు సిఎం కేసీఆర్ కేంద్రానిదే తప్పున్నట్లు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రంలో వరి ఎంత పండుతోందో...చేతికి ఎంత వస్తుందో సరైన అవగాహన లేదు. మొదట 41 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశామని చెప్పి ఒప్పందం చేసుకొంది. కానీ సెప్టెంబర్ 29న కేంద్రానికి వ్రాసిన లేఖలో సుమారు 108 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని తెలిపింది. దానిని శాస్త్రీయంగా లెక్కించకుండా కంటితో చూసి ఉజ్జాయింపుగా చెపుతున్నామని వ్రాయడం బాధ్యతారాహిత్యం కాదా?
ముందు 41 లక్షల టన్నులకు ఒప్పందం చేసుకొని తరువాత 108 లక్షల టన్నులు తీసుకోవాలని పట్టుబట్టడం లేకుంటే ఢిల్లీలో ధర్నాలు చేస్తామంటూ బెదిరించడం సమంజసమేనా? ఐకెపీ కొనుగోలు కేంద్రాలు వద్దని చెప్పింది మీరే కదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఈవిదంగా అబద్దాలు చెప్పడం, వాటితో ప్రజలను, రైతులను తప్పు దోవ పట్టించడం సరికాదు,” అని కిషన్ రెడ్డి అన్నారు.