1.jpg)
సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై, కేంద్రప్రభుత్వంపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దానిపై బండి సంజయ్ నేడు అదే స్థాయిలో ఘాటుగా జవాబు చెప్పారు. ఈరోజు నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ నోరు విప్పితే అన్నీ అబద్దాలే. అబద్దాలు ప్రచారం చేసేందుకే ప్లీనరీలు, సభలు పెడుతుంటారు. దాని కోసం ప్రత్యకంగా ఓ మంత్రిని కూడా ఏర్పాటుచేసుకున్నారు. ఆయన మంత్రి హరీష్‌రావు. కేసీఆర్ చెప్పమన్న అబద్దలనల్లా మారుమాట్లాడకూనా ప్రచారం చేయడమే ఆయన పని. కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం పెట్టి గంటసేపు ఏకధాటిగా అబద్దాలు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై ఎన్నడూ వ్యాట్ పెంచలేదని అన్నారు కానీ 2015లో పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం పెంచారు. ఇది నిజమా కాదా? కేసీఆర్ చెప్పాలి. దేశంలో వ్యాట్ ఆదాయంలో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. దేశంలో 24 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పన్ను తగ్గించాయి. కానీ కేసీఆర్ ఎందుకు తగ్గించరు? వ్యాట్ ఆదాయం కోసమే కదా?
రాష్ట్రంలో 62 లక్షల ఎకరాలలో వరి వేశారని చెప్పారు. అది నిజమో కాదో నిపుణులతో కలిసి హెలికాప్టర్‌లో పర్యటించి తెలుసుకొందామా?రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇంతవరకు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. సిఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేటలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఈ అక్టోబర్ 21 నుంచి జనవరి 20 కేంద్రం రాష్ట్రం నుంచి బియ్యం కొంటామని లేఖ వ్రాస్తే కేంద్రం బియ్యం కొనడం లేదని, ఇక ముందు కొనబోదని, మార్కెట్‌లో యార్డులు మూసివేస్తుందంటూ కేసీఆర్ అబద్దాలు చెప్పారు.
కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలుకుతుంటారు కానీ అక్కడకు వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా తదితరులను ప్రాధేయపడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రైతుల సమస్యలపై ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తామని కేసీఆర్ చెపుతున్నారు. కేసీఆర్‌కు అంత ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు.