ఆర్యన్ ఖాన్ కేసు విచారణాధికారి వాంఖడేపై బదిలీ వేటు

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేపై బదిలీ వేటు పడింది. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్‌ను తప్పించేందుకు ఆయన రూ.8 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు విచారణ నుంచి ఆయనను తప్పించి ఢిల్లీకి బదిలీ చేస్తున్నట్లు ఎన్‌సీబీ తెలిపింది. 

అయితే దీని వెనుక పెద్ద కధే నడిచింది. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, ప్రముఖుల పిల్లల పేర్లు కూడా ఉండటంతో ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు ఓ పధకం ప్రకారమే వాంఖడే బృందంపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. వాంఖడే బృందం ఈ కేసును ఇంకా త్రవ్వితే వారికి సమస్యలు ఎదురవుతాయనే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ముంబై ఎన్‌సీబీపై ఒత్తిడి చేసి చివరికి అతనిని ఈ కేసు నుంచి తప్పింపజేసి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం బిజెపి వాదనలను, ఈ ఊహాగానాలు కొట్టిపడేసింది.  

వాంఖడే స్థానంలో ఎన్‌సీబీలో సీనియర్ అధికారి సంజయ్ సింగ్‌ నేతృత్వంలో కొత్తగా దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటించింది. ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే, ఆర్యన్ ఖాన్‌తో సహా మరో ఆరు మాదక ద్రవ్యాల కేసుల విచారణను ముంబై నుంచి ఢిల్లీ కార్యాలయానికి బదిలీ చేసింది. అంటే ఈ కేసులపై కేంద్ర ప్రభుత్వానికి (బిజెపి)కి, మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికి మద్య గొడవలు కొనసాగే అవకాశం ఉందని భావించవచ్చు.