టిఆర్ఎస్‌ విజయ గర్జన సభ వాయిదా

టిఆర్ఎస్‌ పార్టీ స్థాపించి రెండు దశాబ్ధాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 15న వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహించాలనుకొంది. కానీ దానిని ఈనెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు టిఆర్ఎస్‌ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ 2009, నవంబర్‌ 29 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కనుక ఈనెల 29న దీక్షా దివస్‌ను గుర్తు చేసుకొంటూ తెలంగాణ విజయ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు వరంగల్‌లో సమీపంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్‌లలో పర్యటించి ఈ సభకు అనువైన ప్రాంతం కోసం స్థలాలను పరిశీలించారు. సభ 29కి వాయిదా పడినందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం కేసీఆర్‌ వారికి సూచించారు. 

ఈ సభకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సుమారు 10 లక్షల మందిని తరలించి యావత్ దేశం టిఆర్ఎస్‌ బలాన్ని గుర్తించేలా నిర్వహించాలని టిఆర్ఎస్‌ నిర్ణయించింది. ఈ సభలో రాష్ట్రంలో ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రానికి కూడా గట్టి హెచ్చరిక చేస్తామని సిఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పారు.