మోడీ సభలో బాంబు ప్రేలుళ్ళ కేసులో నలుగురికి ఉరిశిక్ష

2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించేవారు. బిజెపి ఆయనను  తమ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బిజెపి తరపున సభలు, ర్యాలీలలో పాల్గొనేవారు. 2013లో నరేంద్రమోడీ బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. మరికొద్ది సేపటిలో నరేంద్రమోడీ అక్కడకు చేరుకోబోతుండగా సభా ప్రాంగణంలో వరుస బాంబు ప్రేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఆ ప్రేలుళ్ళలో ఆరుగుగూ మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. ఆ కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం) ఒక మైనరుతో సహా మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరిపిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. ఆ కేసులో మొత్తం 8 మందిని దోషులుగా నిర్ధారించి వారిలో నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికీ జీవిత ఖైదు, మరో ఇద్దరికీ పదేళ్ళు జైలు శిక్ష విధించింది. ఈ కేసుతో సంబందం ఉన్నట్లు పేర్కొనబడిన మరో 9 మందిని నిర్ధోషులుగా తీర్పు చెప్పింది. మైనర్ నిందితుడి కేసును జువైనల్ కోర్టుకి బదిలీ చేసింది. 

సాధారణంగా ఇటువంటి ఘటనలు (బాంబు ప్రేలుళ్ళు) జరిగినప్పుడు రాజకీయ నాయకులు తమ సభను రద్దు చేసుకొని లేదా వాయిదా వేసుకొని తిరిగి వెళ్ళిపోతుంటారు. కానీ నరేంద్రమోడీ మాత్రం అక్కడే సభను నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పడం విశేషం.