22.jpg)
నేడు హైదరాబాద్, హైటెక్స్‌లో జరుగుతున్న టిఆర్ఎస్ ప్లీనరీ సభలో సిఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్‌పై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నికల కమీషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ కనుక అది హుందాగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ తన గౌరవం నిలబెట్టుకోవాలి. ఎన్నికలప్పుడు ఒక పార్టీ అధినేతగా నేను ఎన్నికల ప్రచారం చేసుకొనేందుకు సభ పెట్టుకొంటానంటే దానిని అడ్డుకోవలసిన అవసరం ఎన్నికల కమీషన్‌కు ఏమవసరం? ఎన్నికల కమీషన్ తన పరిధి, రాజ్యాంగ పరిధిని కూడా దాటి వ్యవహరిస్తోంది. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఓ బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఓ సలహా ఇస్తున్నాను. రాజకీయ పార్టీల ఒత్తిళ్ళకు తలొగ్గి ఇలాంటి చిల్లర మల్లర పనులు మానుకోవాలి,” అని అన్నారు.
సిఎం కేసీఆర్ ఆగ్రహానికి బలమైన కారణమే ఉంది. మొదట హుజూరాబాద్‌లోనే సభ నిర్వహించుకొందామనుకొంటే కరోనా కారణంగా అనుమతి నిరాకరించింది. అయితే ఆయన ఒక్కరికే కాదు కాంగ్రెస్, బిజెపి నేతలను కూడా అనుమతించలేదు. నియోజకవర్గంలో అనుమతించకపోవడంతో టిఆర్ఎస్ తెలివిగా పక్కనే ఉన్న హుస్నాబాద్‌లో సిఎం కేసీఆర్‌తో సభ పెట్టాలనుకొంటే కేంద్ర ఎన్నికల కమీషన్ దానికీ అడ్డుపడింది. నియోజకవర్గం చుట్టుపక్కల జిల్లాలలో సభలు పెట్టరాదని ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఆలోచన విరమించుకోవలసి వచ్చింది. కనుక ఇప్పుడు ప్లీనరీ వేదికగా ఎన్నికల కమీషన్‌పై ఆగ్రహం వెళ్ళగ్రక్కారు.