షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌కు కస్టడీ పొడిగింపు

షారూక్ ఖాన్ బాలీవుడ్ బాద్‌షా (చక్రవర్తి) అని పిలుస్తుంటారు. కానీ అంత పలుకుబడి, డబ్బు ఉన్నప్పటికీ ఆయన జైల్లో ఉన్న తన కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్‌ సంపాదించలేకపోతున్నాడు. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్‌తో సహా ఏడుగురిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసి అక్టోబర్ 7న ఎన్‌సీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారందరికీ 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్‌ ముంబైలోని అర్ధర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. 

కొడుకును బెయిల్‌పై విడిపించుకొనేందుకు షారూక్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు. కానీ అవేవీ ఫలించలేదు. రెండు వారాల జ్యూడీషియల్ కస్టడీ పూర్తవడంతో న్యాయస్థానం దానిని మళ్ళీ ఈనెల 30వరకు పొడిగించింది. దీంతో షారూక్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 26వరకు విచారణ చేపట్టే అవకాశం లేదని సమాచారం.  

అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్‌ ముంబయి తీరంలో లంగరు వేసిన ఒక విలాసవంతమైన నౌకలో జరుగుతున్న పార్టీకి హాజరయ్యాడు. ఆ నౌకలో జరుగుతున్న పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకొన్న ఎన్‌సీబీ అధికారులు హటాత్తుగా నౌకపై దాడి చేసి దానిలో ఉన్నవారిని అరెస్ట్ చేశారు. వారిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. అతనిని పట్టుకొన్నప్పుడు అతని వద్ద మాదకద్రవ్యాలు ఉన్నాయని, అందుకే అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని ఎన్‌సీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌తో సహా ఏడుగురు నిందితులు జైల్లో ఉన్నారు. 

షారూక్ ఖాన్ బాలీవుడ్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక దశాబ్ధాలపాటు ఎంతో కష్టపడ్డారు. బాలీవుడ్ బాద్‌షా అనిపించుకొనే స్థాయికి ఎదిగిన ఆయన, కొడుకు ఆర్యన్ ఖాన్ చేసిన ఈ పనికి అందరి ముందు తలదించుకోవలసి వస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకొన్న కొడుకు ఇటువంటి కేసులో జైల్లో ఉండాల్సి వస్తున్నందుకు తండ్రిగా ఎంతో బాధపడుతున్నారు కూడా. ఒకవేళ బాంబే హైకోర్టు కనికరిస్తే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్‌, షారూక్ ఖాన్‌కు తాత్కాలిక ఉపశమనం లభిస్తాయి లేకుంటే ఈ ఆవేదన భరించక తప్పదు.