ఈనెల 27న మిర్యాలగూడలో నిరుద్యోగ సభ

బీఎస్పీ సమన్వయకర్తగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలను, విద్యార్దులను, ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈనెల 27న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టిఎన్ఆర్‌ గార్డెన్స్‌లో నిరుద్యోగ సభ నిర్వహించబోతున్నారు. 

రాష్ట్ర బీఎస్పీ కార్యదర్శి డాక్టర్ రాజు మిర్యాలగూడలో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతోంది. కనుక ఈ సభకు విద్యావంతులు, నిరుద్యోగ యువతీయువకులు, మేధావులు హాజరయ్యి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

ఇటీవల ప్రవీణ్ కుమార్‌ ఓ సభలో మాట్లాడుతూ, “రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్దులు గురుకుల పాఠశాలలో చదువుకొంటున్నారు. కానీ కరోనా పేరుతో ప్రభుత్వం వాటిని తెరవకుండా వారిని చదువులకు దూరం చేస్తోంది. తద్వారా వారిని గొర్లు, బార్లు కాపర్లుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. బడుగు బలహీన విద్యార్దులకు విద్య దూరమైతే చివరికి ధనిక భూస్వాముల ఇళ్ళలో వెట్టి చాకిరీ చేసేవారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇకనైనా ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలు తెరవాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజ్యాధికారం గురించి ప్రవీణ్ కుమార్‌ వాదనలు చాలా అర్ధవంతంగా, ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. కనుక మిర్యాలగూడ సభలో కూడా ఆయన చక్కటి సందేశం ఇస్తారని భావించవచ్చు.