24.jpg)
ధాన్యం కొనుగోలుపై సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం పండించే రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదని, ఈ వర్షాకాలంలో పండించే ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,545 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ధాన్యాన్ని మార్కెట్ యార్డులకు తెచ్చే ముందు ధాన్యాన్ని ఎండబెట్టి తేమశాతం తక్కువగా ఉండేలా రైతులు జాగ్రత్తపడాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, సిఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కేంద్రప్రభుత్వం వద్ద మరో 5-6 ఏళ్ళకు సరిపడా ధాన్యం నిలువలు పేరుకుపోయి ఉన్నందున రాష్ట్రాల నుండి ధాన్యం కొనుగోలుచేయలేమని చెప్పడంతో, దేశవ్యాప్తంగా ధాన్యం పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. కనుక సిఎం కేసీఆర్ చేసిన ఈ తాజా ప్రకటన రాష్ట్రంలో రైతులకు చాలా ఊరటనిస్తుంది. కానీ కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు కనుక వచ్చే యాసంగి సీజనులో తెలంగాణలో రైతులు వరి పంటలు వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సిఎం కేసీఆర్ స్వయంగా రైతులకు విజ్ఞప్తి చేశారు.