మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి డిఎస్?

సిఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్‌) మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకోనున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గురువారం ఆయన నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో తిరిగి రావలసిందిగా ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. 

డిఎస్‌ టిఆర్ఎస్‌లో చేరిన తరువాత సిఎం కేసీఆర్‌ ఆయనకు రాజ్యసభకు పంపించారు. కానీ ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి సిఎం కేసీఆర్‌ కుమార్తె నిజామాబాద్‌ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించడంతో టిఆర్ఎస్‌కు డిఎస్‌కు మద్య దూరం పెరిగింది. ఆ తరువాత ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, కనుక ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్వకుంట్ల కవిత స్వయంగా సిఎం కేసీఆర్‌కు లేఖ వ్రాశారు. అప్పుడు డిఎస్‌ సిఎం కేసీఆర్‌ను కలిసి తనపై ఆమె చేసిన ఆరోపణలకు సంజాయిషీ ఇచ్చేందుకు ప్రయత్నించగా, సిఎం కేసీఆర్‌ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. అప్పటి నుంచి ఆయన టిఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం వచ్చింది కనుక ఇది ఆయనకు మంచి అవకాశమే. కానీ కాంగ్రెస్‌లో కూడా ఆయనకు, పార్టీకి ధర్మపురి అర్వింద్ వలన రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుంటుంది. వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ధర్మపురి అర్వింద్‌ బిజెపి నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, నిజామాబాద్‌లో ఆ పార్టీని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయం. అప్పుడు డిఎస్ కొడుకును వెనకేసుకు రాలేరు...అలాగని అతనితో పోరాడలేరు. కనుక ఆయనను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ నేతలు కూడా ఆలోచించుకోవలసి ఉంటుంది. అయినా రాజకీయాల నుంచి తప్పుకోవలసిన ఈ సమయంలో డిఎస్ ఇంకా వాటిలో కొనసాగాలనుకోవడం సరైన నిర్ణయం కాదనే చెప్పవచ్చు.