మంత్రి కేటీఆర్‌కు ఫ్రాన్స్ సదస్సుకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలలో ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ పలు విదేశీ కంపెనీల ప్రతినిధులు, సీఈఓలతో పరిచయాలు ఏర్పడటం సహజం. కనుక మంత్రి కేటీఆర్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నారు. ఫ్రాన్స్‌ ప్రధాని ఇమ్మాన్యూయెల్ అధ్యక్షతన జరిగే ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించవలసిందిగా మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందడమే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

ఈనెల 29న ఫ్రాన్స్‌లో “యాంబిషన్ ఇండియా-2021 సదస్సు’ జరుగుతోంది. దానిలో, ‘గ్రోత్ డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా’ అనే అంశంపై ప్రసంగించవలసిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో ఫ్రాన్స్‌ దేశానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు పాల్గొంటారు. వారు అగ్రి బిజినెస్, హెల్త్ కేర్, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్, క్లైమేట్ ఛేంజ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానిస్తోంది కనుక ఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలను తప్పక తీసుకువచ్చే అవకాశం ఉంది.