
ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్‌పై వాహనాల రాకపోకలు నిషేదించి, నగరవాసులు హాయిగా గడిపేందుకు అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో ఇప్పుడు ఛార్మినార్ పరిసర ప్రాంతాలలో కూడా ప్రతీ ఆదివారం సాయంత్రం వాహనాల రాకపోకలు నిషేదించాలని మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌కు సూచించారు. వారి సూచనపై ప్రజలు కూడా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
ఛార్మినార్ చుట్టూ పెద్ద మార్కెట్, తోపుడు బళ్ళ వ్యాపారులు, వారి మద్యలో నుంచే ఆర్టీసీ బస్సుల రాకపోకలతో నిత్యం ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. ఆ కారణంగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన చారిత్రిక కట్టడాలలో ఒకటైన ఛార్మినార్‌ను చూసేందుకు వచ్చే దేశవిదేశీ పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వాహానాల రద్దీ, వాటితో ప్రమాదాలు, వాటి నుండి వెలువడే వాయు, శబ్ధ కాలుష్యం కారణంగా అంత గొప్ప కట్టడాన్ని పర్యాటకులు కనులారా వీక్షించలేక మొక్కుబడిగా ఓసారి ఛార్మినార్ చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకొని వెళ్లిపోతుంటారు. వాయుకాలుష్యం కారణంగా ఛార్మినార్ కట్టడం కూడా క్రమంగా పాడవుతోంది. కనుక కనీసం వారానికి ఒక పూట ఛార్మినార్‌కు వాహనాల నుంచి విముక్తి కల్పిస్తే కట్టడానికి మంచిదే... పర్యాటకులు ఆహ్లాదంగా గడిపి వెళతారు.