
హుజూరాబాద్ ఉపఎన్నికకు ఇంకా 19 రోజులు మాత్రమే సమయం ఉండటంతో టిఆర్ఎస్, ఈటల రాజేందర్ మద్య మాటల యుద్ధం మరింత ఘాటుగా సాగుతోంది. ఆదివారం హుజూరాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డితో సహా పలువురు బిజెపి కార్యకర్తలు మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈటల రాజేందర్ ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే నియోజకవర్గానికి, ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పడు. ఎందుకంటే ఆయన చేసేదేమీ లేదు కనుక! అందుకే మా ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. తనకు మావల్ల ప్రాణాపాయం ఉందంటూ మొసలి కన్నీళ్ళు కారుస్తూ ప్రజల సానుభూతి సంపాదించుకొనేందుకు ఈటల కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఈవిదంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్న ఆయనకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి. మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని పట్టించుకోని ఈటల రాజేందర్ ఇప్పుడు గెలిస్తే ఏమీ చేయడని వేరే చెప్పక్కరలేదు. కనుక నియోజకవర్గం అభివృద్ధి చేసే టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావాలా... మాయమాటలు చెపుతూ మొసలి కన్నీళ్ళు కార్చే ఈటల రాజేందర్ కావాలా ప్రజలే ఆలోచించుకోవాలి. ఈటల రాజేందర్ తన ఆస్తులు, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారితే ప్రజలు కూడా మారాలా?ఈటల రాజేందర్ సెంటిమెంట్లు, అబద్దాలు, మొసలి కన్నీళ్ళతో హుజూరాబాద్ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కనుక టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.