కౌలు రైతులను ఆదుకొంటాము: సిఎం కేసీఆర్‌

రైతు బంధు పధకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడంపై సిఎం కేసీఆర్‌ ఈరోజు శాసనసభలో వివరణ ఇచ్చారు. శాసనసభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రైతులు నష్టపోకుండా ఉండాలనే కౌలు రైతులను పక్కన పెట్టాల్సివచ్చింది. కౌలు రైతుల విషయంలో మేము మొదటి నుంచి స్పష్టమైన వైఖరినే అవలంభిస్తున్నాము. దానికే ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కనుక భూయజమానులైన రైతుల ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే ధరణీ పోర్టల్‌ను ప్రవేశపెట్టాము. దాని ద్వారా లక్షలాది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

కౌలు వ్యవహారం భూయజమాని (రైతు)కీ దానిని అద్దెకు తీసుకొంటున్న మరో రైతుకీ సంబందించిన ప్రైవేట్ వ్యవహారం. ఒకవేళ దీనిని ధరణీలో చేర్చితే అనేక కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి. అందుకే ధరణీలో కౌలుకు సంబందించిన కాలమ్స్ తొలగించాము. అయితే కౌలు రైతులు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల మాకు సానుభూతి ఉంది. వారిని కూడా మానవతా దృక్పదంతో తప్పకుండా ఆదుకొంటాము. వారి కోసం ఓ వంద రెండు వందల కోట్లు ఖర్చు చేసి ఆదుకోవడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. త్వరలోనే కౌలు రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకొంటాం,” అని అన్నారు.