
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉద్యోగుల విభజనలో తెలంగాణకు చెందిన కొంతమందిని ఏపీకి, ఏపీకి చెందిన కొంతమంది తెలంగాణకు కేటాయించడంతో అప్పటి నుండి వారు స్వరాష్ట్రాలకు తిరిగి వెళ్ళేందుకు ప్రభుత్వాలు, ప్రజాప్రతిధులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఉద్యోగుల బదిలీలకి సిద్దం అయ్యాయి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా, ఏపీ ప్రభుత్వం కూడా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ స్థానికత కలిగినవారు, భార్యాభర్తలలో ఒకరు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నవారు స్వరాష్ట్రానికి బదిలీ కోరుతూ తమ శాఖాధిపతులకు నవంబర్ 7లోగా దరఖాస్తు చేసుకోవలసిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో సుమారు 4-500 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు.