రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది రైల్వే ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం ఈరోజు తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది దసరా, దీపావళి సందర్భంగా నాన్-గెజిటెడ్ ఉద్యోగులందరికీ 78 రోజుల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది. దీని కోసం రూ.1,985 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. దీనివలన దేశవ్యాప్తంగా 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని కేంద్రమంత్రులు తెలిపారు. 

 ఏడాదిన్నరకు పైగా కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా అనేక రైళ్లు నిలిచిపోవడంతో రైల్వేశాఖ తీవ్రంగా నష్టపోతోంది. కనుక ఈసారి బోనస్ లభిస్తుందా లేదా?అని రైల్వే ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా కేంద్రప్రభుత్వం వారికి ఈ తీపి కబురు వినిపించింది. 

తెలంగాణ స్పూర్తితో... 

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, అభివృద్ధి ప్రభావం కేంద్రప్రభుత్వంపై కూడా పడినట్లుంది. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్‌టైల్‌ పార్కు స్పూర్తితో దేశవ్యాప్తంగా ఏడు మెగా ఇంటిగ్రేటడ్ టెక్స్‌టైల్‌ రీజియన్ అండ్ అపెరెల్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రులు ప్రకటించారు. రాబోయే 5 ఏళ్ళలో రూ. 4,445 కోట్ల పెట్టుబడితో వీటిని పీపీఈ పద్దతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 7 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరో 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుపై పది రాష్ట్రాలు ఆసక్తి చూపాయని తెలిపారు.