
సింగరేణి కార్మికులకు ఈసారి దసరా బోనస్ 29 శాతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కంటే ఒక్క శాతం ఎక్కువ ఇచ్చినప్పటికీ ఈసారి చాలా చిన్న మొత్తం బోనస్ లభిస్తుంది. కరోనా, లాక్డౌన్ కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈసారి కేవలం రూ.272 కోట్లు లాభాలు మాత్రమే వచ్చింది. దానిలో 29 శాతం అంటే రూ.79 కోట్లు కార్మికులకు బోనస్‌గా ఇస్తోంది. సింగరేణిలో 43 వేల మంది కార్మికులున్నారు. వారందరికీ ఈ మొత్తాన్ని పంచితే ఒక్కొక్కరికీ ఈసారి రూ.18,000 బోనస్ వస్తుంది.
2019-2020 సంవత్సరంలో సింగరేణికి రూ.999.86 కోట్లు లాభాలు రాగా దానిలో 28 శాతం అంటే రూ.278 కోట్లు కార్మికులకు దసరా బోనస్‌గా ఇచ్చింది. అప్పుడు ఒక్కో కార్మికుడు రూ.60,468 అందుకొన్నాడు. పండుగ అడ్వాన్స్ మరో రూ.25,000 వరకు సింగరేణి ఇచ్చింది. దాంతో కలిపి సుమారు లక్ష రూపాయల వరకు అందుకొన్నారు.
కానీ ఈసారి దసరా బోనస్ ఒక శాతం పెంచి 29 శాతం ఇచ్చినప్పటికీ కేవలం రూ.18,000 చేతికి అందబోతోంది. కనుక ఈసారి కూడా పండుగ అడ్వాన్స్ ఇస్తేనే సింగరేణి కార్మికులు సంతోషంగా పండుగ జరుపుకోగలుగుతారు.