మన తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నమే దళిత బంధు: కేసీఆర్‌

ఈరోజు శాసనసభలో దళిత బంధు పధకంపై జరిగిన చర్చలో పాల్గొన్న సిఎం కేసీఆర్‌ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడిచిపోయాయి. ఈ ఏడు దశాబ్ధాలలో కేంద్రంలో రాష్ట్రంలో అనేక పార్టీలు...కూటములు.. ప్రభుత్వాలు పాలించాయి. కానీ సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళితుల గురించి ఎవరూ ఆలోచించలేదు. అందుకే నేటికీ వారి పరిస్థితులలో పెద్దగా మార్పు రాలేదు. కనుక నిర్లక్ష్యానికి గురైన వారిని ఆదరించి సమాజంలో అందరితో సమానంగా తలెత్తుకొని జీవించేలా చేసేందుకే ఈ దళిత బంధు పధకాన్ని ప్రవేశపెట్టాము. 

ఒకప్పుడు అమెరికన్లు రెడ్‌ ఇండియన్స్‌ తదితరుల పట్ల ఎంత అమానవీయంగా ప్రవర్తించారో తెలుసుకొని తరువాతి తరాలవారు చాలా బాధపడ్డారు. తమ ముందు తరం చేసిన ఆ తప్పులను వారు సరిదిద్దుకొని సమాజంలో వెనుకబడిన అందరినీ కలుపుకుపోతున్నారిప్పుడు. మనదేశంలో కూడా దళితుల పట్ల ఇటువంటి పొరపాట్లే చేశాము. ఈ తప్పును వేరే దేశం వాళ్ళు ఎవరో వచ్చి సరిచేయరు కనుక మన తప్పులని మనమే సరిదిద్దుకోవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ దళిత బంధు పధకాన్ని ప్రవేశపెట్టాము,” అని అన్నారు సిఎం కేసీఆర్‌.